Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Monday, November 13, 2006

ఓ చెలీ!

శ్రీవాణీ వీణా సుస్వర గీర్వాణాలో
రాచిలకల ముద్దు ముద్దు పలుకులో
నయాగరా జలపాత ఘోషలో ఓ చెలీ నీ మాటల్!

మత్తకోకిలల ఉషోదయ రాగాలో
ద్విరేఫపు ఝుంకార నాదాలో
కరిగిన నింగి కరతాళధ్వనులో ఓ చెలీ నీ పాటల్!

ఆభోగీ రాగ ఆరోహణలో
ఉత్పలమాలా ఛంధోగమనమో
వృద్ధ గంగా వినిర్మల ప్రవాహములో ఓ చెలీ నీ నడకల్!

Thursday, October 20, 2005

విరివనంలో నా చెలి

ఒకనాడు నా చెలియ విరివనం లో అడుగిడగా

నేలయడిగె ఆమె పదకోమలత్వము
సంపెంగలడిగె ఆమె మేని పరిమళము
గులాబీలడిగె ఆమె అధరాల వర్ణము
సిరిమల్లెలడిగె ఆమె పలువరుస చందము
గండు కోయిలలడిగె ఆమె కంఠ మాధుర్యము
రాచిలకలడిగె ఆమె పలుకు లాలిత్యము
మకరందములడిగె ఆమె అధర సుధారస మాధుర్యము
సుమబాలలడిగె ఆమె సౌకుమార్యము
సుమములన్నియునడిగె ఆమె కురులందు స్థానము

అన్నియూనడిగె ఆమె అంతటి అందము
మరుజన్మలోనైన ఆమె వంటి రూపము



ఈ కవితకు నేను వ్రాసిన చివరి రెండు ముగింపు పాదాలు నాకు సరైనవిగా అనిపించలేదు.అందుకే ఆ రెండు పాదాలనూ కొద్దిగా దూరంగా వ్రాసాను.
ఎవరైనా ఒక మంచి ముగింపును సూచిస్తే తప్పక దానిని ఈ కవితకు జతపరుస్తాను
భాను

Thursday, September 22, 2005

తరునమ్ ఖాన్ కి అంకితం

Tarunam khan

రేకులు విచ్చిన లేత సోయగమా
వెన్నెలకే కందిపోవు నవయవ్వనమా
కన్నులలో దాచితివేమది నీలి సంద్రమా
నీ లలాటమే విశాల గగనమా
నా ప్రేమను తెలుపుటకు ఇదే మంచి తరుణమా
ఓ తరునమా!
నా మొరాలించి కాస్త కరుణ చూపుమా

Saturday, September 17, 2005

పుష్ప విలాపం

నేను ప్రియురాలి సిగలోన ప్రియుని కాన్కగ మెరసి
ప్రేయసీ ప్రియుల నలరించినాను

నేను భగవత్పాదముల పై పునీతనై
తద్బహుమతిగా గ్రహింపబడినాను

ఇల్లాలి జడలోన పరిమళమై గుబాళించి
పతి అలసట పోగొట్టినాను.

నేడు దేవుని చేరిన వాని మెడలోన అలంకరింపబడి
అంటరాని దాననై చెత్త లో పడి ఉన్నాను

Friday, September 16, 2005

అజ్ఞాత వీరుడి ఆత్మ ఘోష

నేనూ ఒక స్వాతంత్ర్య యోధుడిని
కానీ మహాత్ముడంత గౌరవం దక్కలేదు

దేశ మాత దాస్యశృంఖలాలను చేధించటానికి అహరహం శ్రమించాను
కానీ నేతాజీ అంత పలుకుబడి రాలేదు

ఎన్నో విప్లవ గీతాలకు పల్లవినయ్యాను
కానీ భగత్ సింగ్ అంత ఖ్యాతి రాలేదు

దేశ సేవ కోసం సర్వస్వం అర్పించాను
కానీ నెహ్రూలా ప్రధానిని కాలేదు

ప్రజలను విద్యావంతులనూ,చైతన్యవంతులనూ చేసాను
కానీ రామ్మోహన్ రాయ్ అంత సంస్కర్తగా పేరు రాలేదు

నేనూ కొందరు ఆంగ్లేయులను అంతమొందించాను
కానీ ఊధం సింగ్ లా నా పేరు మీద ఊళ్ళు లేవు

నేనూ దేశమాతను కీర్తిస్తూ ఎన్నో గీతాలు రాశాను
కానీ ఠాగూర్ లా విశ్వ కవిని కాలేదు

దేశం కోసం ప్రాణాలను కూడ అర్పించాను
అందుకే అజ్ఞాతంగా మిగిలిపోయాను.
భాను.