సోమవారం, ఏప్రిల్ 24, 2006

మన మహాభారతం తెలుసుకుందాం

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.చిన్నతనం నుంచీ మనకు పరిచయమున్న మహాభారతం లో మనకెంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం.

౧.కౌరవులు పాండవులను లక్క ఇంటిలో దహనం చెయ్యటానికి కుట్ర పన్నారని మనందరికీ తెలుసు.అయితే ఆ లక్క ఇంటిని ఏ ఊరిలో నిర్మించారు?దాన్ని నిర్మించిన వాస్తు పండితుడు ఎవరు?జ) లక్క ఇంటిని కౌరవులు వారణావతం అనే ఊరిలో నిర్మిస్తారు. ఆ ఇంటిని నిర్మించిన వాస్తు పండితుడు పురోచనుడు. పాండవులకు ఆ ఊరిపై ఆసక్తి కలగటానికి ఎల్లప్పుడూ ఆ ఊరి గురించి వర్ణించేందుకు కౌరవులు కొందరు జీతగాళ్ళను నియమిస్తారు.వారి మాటల వల్ల ఆ ఊరిపై ఆసక్తి కలిగి పాండవులు ఆ ఊరికి బయలుదేరేటపుడు భీష్ముడు వారిని హెచ్చరిస్తాడు.అంతే కాక వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి(సొరంగం తవ్వేందుకు) ఒక సహాయకుడిని వారి కన్నా ముందే అక్కడికి పంపిస్తాడు.
౨.పాండవుల పురోహితుడు ఎవరు? అతడిని పురోహితుని గా వారికి సూచించినదెవరు?
జ)పాండవుల పురోహితుడు ధౌమ్యుడు. అతణ్ణి వారికి పురోహితునిగా సూచించేది కుంభీనసి అనే ఒక గంధర్వ కాంత. అర్జునుడు ఈమెకు పాశుపతాస్త్రాన్ని భోధించి తాను ఆమె వద్ద చాక్షుషీ విద్య నేర్చుకుంటాడు.
౩.మహాభారతం చదివిన వారికి గుర్తుండిపోయే పాత్రల్లో మొట్తమొదటిది భీష్ముడి పాత్ర.ఆయనకి ఆ పేరు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన వచ్చినదే.అయితే భీష్ముడి అసలు పేరు ఏమిటి?
జ) భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.(నిజానికి భీష్ముడు శాపగ్రస్తుడైన ధ్యో అనే వసువు అంశలో జన్మిస్తాడు.)
౪.అర్జునుడికి గాండీవి అనే పేరు ఆయన ధరించే ధనస్సు వల్ల వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లును అర్జునునికి బహుకరించేదెవరు? ఏ సమయంలో?
జ)గాండీవం అనే విల్లు నిజానికి వరుణుడిది.(అందుకే మహాప్రస్థాన సమయంలో అర్జునుడు ఆ విల్లును గంగా నదిలో వదిలేస్తాడు.)అయితే ఈ విల్లుని అగ్ని దేవుడు ఖాండవ దహన సమయంలో బహుకరిస్తాడు(కారణం ఖాండవ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూండటం.)
౫.జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపేదెవరు?యాగం ఆగే సమయానికి ఋత్విక్కులు ఎవరిని యజ్ఞ గుండం లోకి ఆవాహన చేస్తారు?
జ)సర్పయాగాన్ని ఆపేది అస్తీకుడు.(ఇతను ఆదిశేషుడికి మేనల్లుడు అవుతాడు.అస్తీకుడు సర్పయాగాన్ని ఆపటానికై జన్మించిన కారణ జన్ముడు. ఇతను యజ్ఞ వాటికకి వచ్చి వేద మంత్రాలతో ఆ యజ్ఞం చేస్తున్న రాజుకు ఆశీర్వచనాలు చదువుతూ ఉంటాడు. రాజు అతన్ని చూసి ముచ్చట పడి ఏం కావాలో కోరుకోమనగా ఈ యజ్ఞాన్ని ఆపేయమని కోరతాడు.)యజ్ఞం ఆపే సమయం లో ఋత్విక్కులు తక్షకుడిని ఆవాహన చేస్తారు.అయితే తక్షకుడు భయంతో ఇంద్రుడి అభయం పొందగా మంత్ర ప్రభావం వల్ల ఇంద్రుడు కూడా యజ్ఞ గుండంలో పడబోతాడు. ఐతే యజ్ఞం ఆగిపోయిన కారణంగా రక్షింపబడతాడు.(తక్షకుడిని ఆవాహన చెయ్యటానికి ఋత్విక్కులు చదివే మంత్రం "సహేంద్రే తక్షకాయ స్వాహా!")

౬.అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?
జ)ధర్మ రాజు: కంకభట్టు.
భీముడు:వలలుడు.
అర్జునుడు: బృహన్నల.
నకులుడు:థామగ్రంధి.
సహదేవుడు:తంత్రీపాలుడు.
౭.రణరంగం లో వీరవిహారం చేస్తున్న ద్రోణుడిని అస్త్ర సన్యాసం చేయించటానికి శ్రీకృష్ణుడు 'అశ్వత్థామ' అనే ఏనుగును చంపించి ధర్మరాజు చేత 'అశ్వత్థామ హతః' అని గట్టిగా 'కుంజరః' అని చిన్నగా అనిపిస్తాడు.ఇంతకీ ఆ 'అశ్వత్థామ' ఏనుగును చంపేదెవరు?
జ)'అశ్వత్థామ' ఏనుగును చంపేది భీముడు.(తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు.)
౮.యుద్ధ ప్రారంభ సమయంలో ధర్మరాజు ఇరుపక్షాల లో ఎవరైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని ప్రకటిస్తాడు.ఆ సమయం లో ఎవరెవరు తమ పక్షాలు మారతారు?
జ)ధర్మరాజు చేసిన ప్రకటనతో పక్షం మారేది యుయుత్సుడు.(ఇతను ధ్రుతరాష్త్రుడికి ఒక దాసి వల్ల జన్మిస్తాడు.పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళే సమయం లో బాలుడైన పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి యుయుత్సుడికే రాజ్యభారం అప్పగిస్తారు.)

౯.కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధ్రుతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు.కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవటం తాను కళ్ళారా చూడలేనని తిరస్కరిస్తాడు ధ్రుతరాష్ట్రుడు. కానీ కృష్ణుడు వేరే అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ధ్రుతరాష్త్రుడికి యుద్ధ విశేషాలు వివరించమంటాడు.కృష్ణుడు ఎవరికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు?
జ)కృష్ణుడి ద్వారా దివ్య దృష్టి పొందేది సంజయుడు.(ఇతను అర్జునుడికి ప్రాణ స్నేహితుడు.)
౧౦.మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది?
జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది.(శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒక గుహలో ప్రవేశిస్తుంది శిఖండి. అక్కడ ఉన్న ఒక గంధర్వుడు ఆమె కథ విని జాలి పడి తన పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రుపాన్ని తాను గ్రహిస్తాడు.ఈ విధంగా శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతుంది.(ఆమెకు పురుష రూపాన్ని ప్రసాదించినందుకు గంధర్వ రాజైన కుబేరుడు ఆ గంధర్వుడి పై కోపించి ఆమె మరణించేంత వరకు స్త్రీ రూపం లోనే ఉండమని శపించటం వేరే కథ.)

2 వ్యాఖ్యలు:

kiran kumar Chava చెప్పారు...

౧ లక్క ఇల్లు తెలీదు
౨ దౌమ్యుడు, వ్యాసుడు సూచించినాడు
౩ గాంగేయుడు (ఇంకోపేరు కూడా ఉన్నదనుకోండి కానీ గుర్తు రావడంలేదు)
౪ అగ్ని దేవుడు (ఖాండవ వన దహన సమయంలో?)
౫ జరత్కారుడు, తక్షకుడు (ఇంద్రుని సింహాసనంతో సహా వస్తూ ఉంటాడు)
౬ అర్జున = బృహన్నల
భీముడు = వలులుడు?
???
౭ భీముడు చంపుతాడు
౮ ఒకరు కౌరవుల నుండి పాండవులవైపు వస్తాడు (*కర్ణ*?)
౯ సంజయుడు
౧౦ ????

Venkata Subbaiah చెప్పారు...

చక్కని బ్లాగు.
నాకు తెలిసినంతలో కొన్ని సవరణలు:
1. పాండవులను హెచ్చరించేది, సాయపడేది - విదురుడు (భీష్ముడు కాదు)
2. పాండవులకు ధౌమ్యుని సూచించేది - అంగారపర్ణుడు అనే గంధర్వ రాజు. అర్జునుడు ఇతనికి నేర్పేది ఆగ్నేయాస్త్రం (పాశుపతం కాదు). ప్రతిగా అంగారపర్ణుడు ఇచ్చే చాక్షుసీ విద్యని అర్జునుడు స్వీకరించడు. కేవలం గుర్రాలని స్వీకరిస్తాదు
9. సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించేది వ్యాసుడు, కృష్ణుడు కాదు. సంజయుడు ధృతరాష్ట్రుని సారథి.