Wednesday, December 03, 2008
వారెవా ఏమి ఫేసు
ఈ రోజు ఈ పాట వింటున్నాను. ఆశ్చర్యం. ఈ పాటలో వినిపించే రెండు మూడు గొంతుల్లో గురువుగారు సీతరామశాస్త్రి గారి గొంతు ప్రస్ఫుటంగా, ప్రత్యేకంగా వినిపించింది. నిజమో కాదో అని రెండు మూడు సార్లు విన్నాను. అవును గురువు గారే.
మీరు గమనించే ఉంటారు. కానీ మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపించి ఈ టపా రాస్తున్నాను.
మీరు గమనించి ఉండకపోతే ఒకసారి వినండి.
Saturday, November 29, 2008
అమెరికా జెండా గురించి కొన్ని నిజాలు
"Adolf hitlerr rose to power with arms as george bush does.I am ashamed of the people of this country who call themselves Americans, who drive having a silly US flag on their cars without realizing that its not a US flag. The original United states flag has the stripes going vertical not horizontal. .
ఇది వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. నిజమేనా? జార్జ్ బుష్ తన దేశపు జెండా గురించి అంత అలసత్వంతో ఉంటాడా? ఆయన అంత అలసత్వం చూపించినా ప్రజలూ, మీడియా ఊర్కుంటాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు. గూగుల్ వెతుకులాటలో దొరికిన అన్ని బొమ్మల్లోనూ జెండాలో చారలు అడ్డంగానే ఉన్నాయి. చివరికి లండన్‍లో అమెరికన్ ఎంబసీ వారి అధికారిక వెబ్ సైట్ కూడా తమ జెండాకి చారలు అడ్డంగానే(horizontal) ఉంటాయని స్పష్టంగా చెప్పేసింది. కానీ ఈ పేజిలో ఈ విషయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చర్చించారు. దీని నుంచీ నేను గ్రహించిన వివరాలు సంగ్రహంగా ఇవీ
అమెరికా స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత దేశ చిహ్నాలుగా రెండు జెండాలను తయారు చేసారట. సైనిక ఉపయోగాల కోసం అడ్డ చారలుండే జెండాలనీ, సాధారణ అవసరాల కోసం నిలువు చారలుండే జెండానీ తయారు చేసారట. అయితే ప్రభుత్వం ఈ అడ్డ చారల జెండాలే ఎక్కువ తయారు చేయిస్తుండటంతో నిలువు చారల జెండల తయారీ కూడా తగ్గింది. పైగా నిలువు చారల జెండాల ధరలు కూడా ఎక్కువ ఉండటంతో వాటికి ఆదరణ తగ్గింది. అలా అలా 1980 కల్లా అసలు ఈ నిలువు చారల జెండా గురించి అన్ని తరగతి పుస్తకాల నుంచి కూడా తొలగించారట.
![]() నిలువు చారల జెండా | ![]() అడ్డ చారల జెండా |
Thursday, September 25, 2008
నా మొదటి ఛందో పద్యం
మొన్న కొత్తపాళీ గారు ఇచ్చిన ఈ ఇతివృత్తం చూసినప్పుడు నాకు “సిరికిన్ జెప్పడు” లాగా లక్ష్మీ దేవి తన భక్తులను రక్షించటానికి వెళ్ళే సన్నివేశాన్ని అదే ఛందస్సులో రాయాలన్న ఊహ వచ్చింది. చాలా కష్టపడ్డాక చివరికి ఈ పద్యం రాయగలిగాను. ప్రాస అయితే కుదిరింది కానీ యతి కుదరలేదు.
మ|| హరికిన్ జెప్పదు కైటభారి పదముల్ సంప్రీతి సేవింపదే
సురపుష్పమ్ములు బెట్టదన్యములు ఆలోచింపదాందోళనా
భర మంజీరములొగ్గగా గనదు పాలార్ణమ్మునన్ దిన్న వే
లరుచుల్వెన్నలు అంటగా దుడువదా భక్తావనోత్సాహియై
తన భక్తులని రక్షింప ఉద్యుక్తయైన లక్ష్మి, ఆ హరికైనా చెప్పక, తాను ఎంతో ప్రేమతో సేవించే విష్ణుమూర్తి పాదాలను సేవించక, తనకి ఇష్టమైన పారిజాతాలైనా పెట్టుకోక,మరే విషయముల గురించీ ఆలోచించకా,ఆందోళన నిండిన ఆమె పాదాల వడిని ఓర్వలేక జారుతున్న మువ్వలనైనా సరిజేయక, ప్రీతితో క్షీరసాగరంపై తేలేటి వెన్నలు తినగా పెదాలపై అంటుకున్న తరకలైనా తుడువక ఉన్నఫళంగా వడివడిగా, హడావిడిగా బయలుదేరింది.
ఈ ఇతివృత్తాన్నికి కథ కూడా మొదలు పెట్టాను. గడువు పొదిగించారు కదా, పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను.
Friday, September 12, 2008
దేవుడు కూడా మోయలేని రాయి
ఒకసారి ఒక అవధానంలో అసందర్భ ప్రసంగంలో ఒక పృచ్ఛకుడు అడిగాడట "ఆ దేవుడు కూడా మోయలేని రాయి ఏది?" అని.
అప్పుడా అవధాని హాస్యంగా ఇలా చెప్పారట.
"ఆ దేవుడు కూడా మోయలేని రాయినే సంసారం అంటారు నాయనా. ఆ దేవుళ్ళు కూడా ఈ సంసార సాగరాన్ని ఈదలేకపోయారు. ఆ విష్ణుమూర్తినే చూడండి. ఆయనకీ ఇద్దరు భార్యలు. ఒకరేమో లక్ష్మీ దేవి. సుచల.ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఇంకొకరు భూదేవి.అచల. స్థిరంగా ఉంటుంది తప్ప ఎక్కడికీ కదలలేదు. ఇక ఆ శివుడి సంసారాన్నే తీసుకుంటే ఆయన వాహనం ఎద్దు, ఆయన బార్య వాహనమేమో సింహం. ఆ సింహం ఈ ఎద్దుని ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆయన పెద్దకొడుకు వినాయకుడి వాహనమేమో ఎలుక. శివుడి మెడలో ఉన్న పాము ఈ ఎలకని తిందామని చూస్తుంటే ఆయన రెండో కొడుకు కుమారస్వామి వాహనమైన నెమలేమో ఆ పాము వంక చూస్తుంటుంది ఎప్పుడు తిందామా అని. ఇలా వాహనాల మధ్య గొడవలతో సతమతమయ్యే ఆయనకి సవతులైన గంగాగౌరిల కయ్యాలు ఉండనే ఉన్నాయి. అందుకే నాయనా ఆ దేవుడు కూడా మోయలేని రాయి సంసారం తప్ప మరొకటి కాదు" అని హాస్యంగా సమాధానం చెప్పారట.
Thursday, September 04, 2008
అన్నమయ్య పై నా బ్లాగు
అన్నమయ్యకు అక్షర నీరాజనం అనే ఈ బ్లాగులో అన్నమయ్యకీర్తనలూ, ఆయన జీవిత విశేషాలూ, ఆయన రచనా వైభవం, వాటిలోని చమత్కారాలూ వీటి గురించి నాకు తెలిసిన విషయాలు రాస్తూ ఉంటాను.
ఈ బ్లాగుపై మీ అభిప్రాయాలు చెప్పగలరు.
Friday, August 22, 2008
ఫైర్‌ఫాక్స్ కి తెలుగులో ఓ మంచి పేరు పెడదాం
మొన్న వీవెన్ గారి బ్లాగులో ఫైర్‌ఫాక్స్‌ని "మంట నక్క" అని ప్రస్తావించటం చూసాను.
ఆ పదంలో ఏమంత దోషాలు లేకపోయినా నాకెందుకో ఆ పేరు ఫైర్‌ఫాక్స్ కి అంతగా నప్పలేదేమో అనిపించింది.
ఫైర్‌ఫాక్స్‌ని తెలుగులో "జ్వాలా జంబూకం" అని కానీ "జ్వాలా శృగాలం" అని కాని అంటే ఎలా ఉంటుంది?
మీ అభిప్రాయాలు చెప్పండి..
నేనొచ్చేసా - మూడో సారి
భాను
Sunday, March 30, 2008
ఏప్రిల్ 11 పెద తిరుమలయ్య జయంతి
ఆయన కూడా అన్నమయ్య లా ఎన్నో శ్రుంగార, ఆధ్యాత్మిక సంకీర్తనలను రచించారు.
ఆయన జయంతి ఏప్రిల్ 11 అట. నిన్న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పెద తిరుమలాచార్యుని మీద ఒక చిన్న వ్యాసం వేసారు.
ఆ వ్యాసాన్ని ఇక్కడ చూడండి.
ఈ సందర్భంగా అందరం అన్నమయ్యనూ, వారి వారసుడు పెద తిరుమలయ్యనూ ఒక్కసరి స్మరించుకుందాం.



