గురువారం, సెప్టెంబర్ 25, 2008

నా మొదటి ఛందో పద్యం

మొన్న కొత్తపాళీ గారు ఇచ్చిన ఇతివృత్తం చూసినప్పుడు నాకు సిరికిన్ జెప్పడు లాగా లక్ష్మీ దేవి తన భక్తులను రక్షించటానికి వెళ్ళే సన్నివేశాన్ని అదే ఛందస్సులో రాయాలన్న ఊహ వచ్చింది. చాలా కష్టపడ్డాక చివరికి పద్యం రాయగలిగాను. ప్రాస అయితే కుదిరింది కానీ యతి కుదరలేదు.


|| హరికిన్ జెప్పదు కైటభారి పదముల్ సంప్రీతి సేవింపదే

సురపుష్పమ్ములు బెట్టదన్యములు ఆలోచింపదాందోళనా

భర మంజీరములొగ్గగా గనదు పాలార్ణమ్మునన్ దిన్న వే

లరుచుల్వెన్నలు అంటగా దుడువదా భక్తావనోత్సాహియై


తన భక్తులని రక్షింప ఉద్యుక్తయైన లక్ష్మి, హరికైనా చెప్పక, తాను ఎంతో ప్రేమతో సేవించే విష్ణుమూర్తి పాదాలను సేవించక, తనకి ఇష్టమైన పారిజాతాలైనా పెట్టుకోక,మరే విషయముల గురించీ ఆలోచించకా,ఆందోళన నిండిన ఆమె పాదాల వడిని ఓర్వలేక జారుతున్న మువ్వలనైనా సరిజేయక, ప్రీతితో క్షీరసాగరంపై తేలేటి వెన్నలు తినగా పెదాలపై అంటుకున్న తరకలైనా తుడువక ఉన్నఫళంగా వడివడిగా, హడావిడిగా బయలుదేరింది.

ఈ ఇతివృత్తాన్నికి కథ కూడా మొదలు పెట్టాను. గడువు పొదిగించారు కదా, పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను.

7 వ్యాఖ్యలు:

రానారె చెప్పారు...

పద్యం నడక బాగుందండీ. యతి కుదర్లేదని మీరు చెప్పేదాక ఆలోచనకు రాలేదు. మొదటి పద్యం కనుక మీకు అభినందనలు మాత్రం తెలియజేస్తున్నాను.

Chandra Mohan చెప్పారు...

మొదటి ఛందో పద్యం బాగుంది. కాకుంటే ఆర్ణము అనే పదం లేదు. ఆర్ణవము అని గాని ఆర్ణోరాశి అని గాని చెప్పాలి.

అభినందనలు.

చంద్ర మోహన్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మీ మొదటి పద్యము బాగుంది. కాని తెలుగు "పాల"ను సంస్కృత "అర్ణవం" తో కలిపితే వ్యాకరణము ఒప్పుకోదేమో!

నాకు మరో సందేహము.
ఆలోచింపదు + ఆందోళనాభర = ఆలోచింపదాందోళనాభర
ఇది సరైన ఉకార సంధి యేనా? ఏవరైన తెలప గలరు?
("ఆందోళనాభర" సంస్కృత పదము కదా! అందుకని సందేహము వచ్చినిది)
- సత్య

Srinu Tamada చెప్పారు...

If this is your first poem, then its great man. Keep it up.

rajachandra చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
rajachandra చెప్పారు...

modati padyame ayina modatipadyam la ledu.......

chakkaga rasaru

mi bloge oka all in one la undi.
naku mi heading nachhindi.

www.yuvabharathyouth.blogspot.com

కంది శంకరయ్య చెప్పారు...

మొదటి ప్రయత్నమైనా నడక (యతిదోషం ఉన్నా) బాగుంది.
ఛందోబద్ధంగా పద్యం వ్రాయాలనుకున్నప్పుడు మొదటి తేటగీతి, ఆటవెలదులతో ప్రారంభించడం మంచిది. సలక్షణ పద్యరచనా ప్రావీణ్య ప్రాప్తిరస్తు!