ఆదివారం, జనవరి 22, 2012

నా మూడో చంధో పద్యం - తిరుమొళిశై ఆళ్వారుల దివ్య పాశురం


వైష్ణవాన్ని ఉజ్జీవింప చేసిన వారిలో ఆళ్వారులు ప్రముఖులు.
ఈ పన్నిద్దరు ఆళ్వారుల లోనూ తిరుమొళిశై ఆళ్వారులది ప్రత్యేక స్థానం.

తిరుమొళిశై ఆళ్వారులు శ్రీమన్నారాయణుని ఆయుధమైన సుదర్శన చక్ర అంశలో జన్మించారు.
వీరు మొదట శ్రీ వైష్ణవ మతాన్ని అవలంబించినా, స్థిర చిత్తము లేక ఎన్నో మతాలు అవలంబించారు. వీరు శైవ మతాన్ని కూడా స్వీకరించి ఆ మతం పై గ్రంధాలు కూడా రచించారు. అందుకే వీరికి శివాక్యర్ అనే పేరు కూడా వచ్చింది.
కానీ ఒకనాడు పేయాళ్వారులు వీరికి జ్ఞానోదయం కలిగించి వీరిని మరలా శ్రీ వైష్ణవం లోనికి మార్చారు.
అప్పటి నుండీ ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుని పూజించి తరించారు.
హనుమంతుడు తన హృదయం చీల్చి సీతా రాములను చూపించినట్టుగా ఈ ఆళ్వారులు కూడా ఒకానొక సందర్భం లో తన హృదయ మందిరం లో కొలువై ఉన్న శ్రీమన్నారాయణుని అందరికీ దర్శింప చేసారు.
ఈ ఆళ్వారులు పరతత్త్వ నిర్ణయం చేస్తూ ద్రవిడం(తమిళం) లో  చెప్పిన ఒక దివ్య పాశురం

కురై కొండు నాన్ముగన్ కుండిగై నీర్ పెయ్‍దు
మరైకొండ మంతిరత్తల్ వాళ్‍త్తి
కరైకొండ కండత్తాన్ శెన్నిమేల్ ఏరక్కళువినాన్
అండత్తాన్ శేవడియై ఆంగు
అంటే
వామనావతార విజృంభణా వేళ బ్రహ్మాండమంత ఎత్తు పెరిగిన  నారాయణుడు పైకి తన శ్రీ పాదమును చాచగా, బ్రహ్మ దేవుడు ఆ పాదమును తన కమండలం లోని నీటితో పురుష సూక్తం చదువుతూ ప్రక్షాళన చేసాడు. ఆ నీటినే శివుడు తన తలపై గంగగా ధరించాడు. కనుక ఈ ముగ్గురిలో పురుషోత్తముడెవరో తెలుసుకోండి అంటూ పాఠకులకే వదిలేసారు.
సాధారణంగా ఎవరైనా గొప్పవారికి పాద పూజ చేసేటప్పుడు వారి పాదాలు కడిగి ఆ శేష జలాన్ని మన తలపై ధరిస్తాం. ఇక్కడ పాదాలు శ్రీహరివైతే , కడిగిన వారు బ్రహ్మ, శిరసు పై ప్రోక్షించుకున్న వారు శివుడు.
కనుక ఈ ముగ్గురిలో పర దైవం ఆ శ్రీహరే అని చెప్పకనే చెప్పారు.

ఈ పాశురాన్ని నేను తెలుగులోకి అనువదించాలి అనుకొని ఈ క్రింది ఆటవెలది పద్యం వ్రాసాను.
ఆ.వె|| ఒకడు పదము ఎత్తి ఉర్వి నభము నిండ
ఒకడు అట్టి పదము నొనర కడిగె
ఒకడు అట్టి జలము నొప్పుగా తలదాల్చె
ఎవరు ఇందు ఘనులు ఎంచి చూడ
ఈ పద్యం లో కానీ, టపా లో కానీ ఏమన్నా దోషాలుంటే దయచేసి తెలుపగరు. సరిదిద్దుకుంటాను.
ఇక శెలవు.

కామెంట్‌లు లేవు: