బుధవారం, డిసెంబర్ 28, 2011

నా రెండో చంధో పద్యం


కొన్నాళ్ళ క్రితం నేను   పద్యంతో నా చంధో ప్రయాణం ప్రారంభించాను.
ఈ పద్యం నడక బాగున్నా యతి నియమం పాటించటంలో నేను అంత శ్రద్ధ చూపలేదు.
ఇక తర్వాత యతి నియమం కూడా పాటించి ఈ పద్యాన్ని మార్చి రాద్దామని అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు.
ఈ మధ్యన రామాయణంలో అహల్యా శాప విమోచన ఘట్టం చదువుతున్నప్పుడు "ఈ పాదాలకు రాతిని నాతి చేయగలిగే మహిమ ఎలా అబ్బి ఉంటుంది?" అనే ప్రశ్న నాలో ఉదయించింది. 
ఈ ప్రశ్నా దాని సమాధానం ఒక పద్యంలా రాయాలని సంకల్పించి ఇదిగో ఈ క్రింది ఉత్పలమాల పద్యం వ్రాసాను.

|| రాతిని నాతి చేసిన పదమ్ములు నావను మోపగా అదే
రీతిగ మారునో యను గుహాగ్రణి శంకలు సత్యమే సుమీ!
ప్రీతిగ లోకమాత యగు ఇందిర హస్తము లొత్తు అంఘ్రికిన్
పాతకముల్ హరించెడి మహాత్మ్యము లబ్బుట వింత గాదులే

ఈ పద్యంలో కూడా మొదటి పద్యం లానే యతి కుదరలేదు. కానీ ఈ సారి వదలకుండా ప్రయత్నించి ఈ పద్యాన్ని  యతి ప్రాసలు కుదిరేలా ఇలా మార్చాను.


|| రాతిని నాతి చేసిన సుర హ్రద పితృ పదమ్ము నావనే
రీతిగ మార్చునో యనుచు రేగిన శంకలు సత్యమే సుమీ!
ప్రీతిగ లోకమాత మురిపెమ్ముగ యొత్తెడు దివ్య అంఘ్రి వి
ఖ్యాతిగ పాతకమ్ములు నఘమ్ములు మాపుట వింత గాదులే

నేను ఈ పద్యం తీసుకుని ఆనందంతో నాకు తెలిసిన ఒక పెద్దాయన దగ్గరకు వెళ్ళాను. ఆయన చంధో పద్యాలు రాయటంలో దిట్ట. ఆయన ఈ పద్యం చూసి ఇందులో కొన్ని  దోషాలు ఇలా చెప్పారు
1. మూడో పాదంలో దివ్య అంఘ్రి సంధి కలిసి దివ్యాంఘ్రి అయిపోతుంది.కాబట్టి ఇలా విడిగా వాడకూడదు.
2. నాలుగో పాదంలో పాతకమ్ములు నఘమ్ములు అన్నప్పుడు ఒకే విషయాన్ని మరలా మరలా చెప్పటం వలన పునరుక్తి దోషం కలిగింది.
అయితే ఈ రెంటి కన్నా పెద్దదీ, అసలైందీ ఒక తప్పు ఉంది.
మొదటి పాదంలో పితృ పదమ్ము అనే పదంలో తృ ని సంయుక్తాక్షరంగా భావించి దాని ముందరి అక్షరమైన పి ని గురువు(U) గా స్వీకరించబడింది.
కానీ అసలు విషయమేంటంటే తృ" అనేది సంయుక్తాక్షరం కాదు. అది త గుణింతంలో వస్తుంది. కాబట్టి పి గురువు కాదు. దానితో అక్కడ రావలసిన గణం కాస్తా గణం అయ్యి పద్యం ఉత్పలమాల కాలేదు.

ఇంకేం చేస్తాం. కొంచం కుస్తీ పట్టి ఆ దోషాలన్నీ సరి చేసి చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ పద్యం ఇలా వచ్చింది.

|| రాతిని నాతి చేసిన సుర హ్రద జన్యు పదమ్ము నావనే
రీతిగ మార్చునో యనుచు రేగిన శంకలు సత్యమే సుమీ!
ప్రీతిగ లోకమాత మురిపెమ్ముగ నొత్తెడు పాద పద్మముల్
ఖ్యాతిగ లోకవాసుల నఘమ్ములు మాపుట వింత గాదులే!

 ఈ పద్యం నాకైతే బాగానే నచ్చింది.
 మీ అభిప్రాయం చెప్పండి.

2 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

మీకే కాదు నాకు కూడా నచ్చింది భాను గారూ!

అనిల్ రెడ్డి చెప్పారు...

బాగుంది!