మంగళవారం, డిసెంబర్ 15, 2009

కాళిదాసు గురించి -1 : కోహం రండే?

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.   ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు   "ఉపమా కాళిదాసః" అంటారు.
కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.


ఏది ఏమైనా కాళిదాసుని "Indian Shakespeare" అనటం మాత్రం చాలా అన్యాయం. మన కవులని వాళ్ళతో పోల్చి మనని తక్కువగా చూపించటమే ఇందులో బ్రిటీషు వాళ్ళ  ముఖ్య ఉద్దేశ్యం.
కాళిదాసు గురించి నేను విన్న, చదివిన విషయాలు మీతో పంచుకోవాలని ఈ టపా మొదలు పెడుతున్నాను.
సరే ఇక ఈ రోజు కధలోకి వెళ్తే
భోజ రాజు ఆస్థానంలో కాళిదాసు తో పాటు భవభూతి, దండి అని ఇద్దరు కవులు ఉండేవారు. ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి. అలాంటిది ఒకసారి వాళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే చర్చ బయల్దేరింది, విషయం చినికి చినికి గాలి వానై
భోజ రాజు దగ్గరకు వెళ్ళింది. ఆయన కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేక చేతులెత్తేసాడు. ఇక మనం ఆ కాళీ మాతనే అడిగి తెలుసుకుందాం  అని ముగ్గురూ కాళీ మాత ఆలయానికి బయలుదేరారు,కాళిదాసు నాలుక పై బీజాక్షరాలు వ్రాసి ఆయని కవిగా తీర్చిదిద్దింది సాక్షాత్తూ ఆ కాళీ మాతే. తప్పకుండా నేనే గొప్ప కవి అని తీర్పు చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఆనందపడసాగాడు కాళిదాసు. ముగ్గురూ ఆలయానికి చేరుకుని తమ వివాదాన్ని నివేదించి అమ్మ ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో అమ్మవారి విగ్రహం నుండి మాటలు వెలువడ్డాయి
"కవిర్దండీ కవిర్డండీ భవభూతీ పండితః" అని ఆగింది కాళీ మాత
అంటే దండి కవి, భవభూతి పండితుడూ అని వాళ్ళ ఇద్దరి గురించీ చెప్పింది కానీ కాళిదాసు గురించి అస్సలు చెప్పలేదు. ఒకపక్క దండీ, భవభూతీ మురిసిపోతుంటే కాళిదాసు మాత్రం నిశ్చేష్టుడయ్యాడు.  తనని కవిని చేసి ఆశీర్వదించిన అమ్మ ఇలా అవమానిస్తుందని ఊహించని కాళిదాసు పట్టరాని కోపంతో
"కోహం రండే?" అని గట్టిగా కాళీ మాతనే అడిగాడు.
(అంటే నేనెవరినే ...(రండ అనేది ఒక బూతు మాట) )
కాళిదాసు ఇలా అనేసరికి దండీ, భవభూతీ నిశ్చేష్టులై అలాగే నిలబడి పోయారు.
వెంటనే కాళీ మాత "త్వమేవాహం త్వమేవాహం కాళిదాసో త్వమేవాహం" (అంటే నువ్వే నేను, ఓ కాళిదాసా) అని బదులిచ్చింది. 

తను చేసిన తప్పు గుర్తించిన కాళిదాసు ఎంతో సిగ్గుపడి తనని క్షమించమని వేడుకుంటూ కాళికా దేవిని  ఎన్నో రకాలుగా కీర్తించాడు.  అయినా పిల్లవాడు తప్పు చేస్తే ఏ తల్లైనా కోపం తెచ్చుకుంటుందా?
సాక్షాత్తూ అమ్మవారే కాళిదాసు గొప్పతనం గురించి చెప్పటంతో మిగిలిన ఇద్దరికీ అది ఒప్పుకోక తప్పలేదు,
ఇదండీ ఈ రోజు కధ.
మరో కధతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. 
అంతవరకూ శెలవు

10 వ్యాఖ్యలు:

Enaganti Ravi Chandra చెప్పారు...

చాలా బాగుందండీ కథ. ఇప్పటి దాకా ఎక్కడా చదవలేదు. మంచి కథను అందించారు. మీరు ఇలాగే కొత్త కొత్త, ఆసక్తికరమైన కథలు అందించాలని కోరుకుంటున్నాను.

lakshman చెప్పారు...

Really excellent. We need these kind of articles.
If possible please add my mail id to your article threads.

శ్రీకాంత్ చెప్పారు...

Good one.

నాగమురళి చెప్పారు...

క్షమించాలి, చిన్న సవరణ. నోహం కాదు, కో2హం - నేనెవర్ని? అని.

ఈ కథ నాకూ పరిచయమే. కాళిదాసు, భవభూతి, దండి వేర్వేరు కాలాలకి చెందినవాళ్ళు; ఆ కవుల చుట్టూ మనలాంటివాళ్ళు అల్లుకున్న అనేక కథల్లో ఇదీ ఒకటి.

http://nagamurali.wordpress.com

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

చాలా బాగుందండి. మరిన్ని కాళిదాసు కథలు చెబ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా, భోజరాజుకు ఓసారి తను మరణిస్తే, తన రాజ్యం ఎలా ఉంటుందో వర్ణించమని కాళిదాసును విసిగించటం.... ఏదో టీవీ ఛానల్ లో విన్నాను సరిగ్గా గుర్తులేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.

భాను చెప్పారు...

@నాగమురళి గారు,
నాకూ అది కోహమా లేకా నోహమా అని చిన్న సందేహం ఉంది. కానీ ఎందుకో నోహం అయ్యుంటుంది అని అనుకున్నాను. మీరు చెప్పినట్టు తప్పకుండా సవరిస్తాను.

@సాయికిరణ్ కుమార్ గారు,
మీరు సూచించిన కధ కూడా త్వరలో రాస్తాను.

usha చెప్పారు...

Really a Gud one SIR,Keep Going:).

adepu చెప్పారు...

nenu eppudu vinaledu ee katha. chala bagundisir

రసజ్ఞ చెప్పారు...

"త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః " (అంటే నువ్వే నేను నేనే నువ్వు నువ్వే నేను ఇందులో సందేహమే లేదు) అని అన్నది ఆ కాళికాదేవి అని విన్నాను పదాలేమయినా అర్థం ఒకటే కదా! చక్కని కథని చెప్పారు!

life4music చెప్పారు...

vedalu nalugu antaru. asalu a vedalalo emuntundi ani telusukovalani vundi dayachesi evarikaina telisina yedala telupagalaru