అవధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

దేవుడు కూడా మోయలేని రాయి

మొన్న ఈటీవీ-2 లో తెలుగు-వెలుగు కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు ఈ హాస్యోక్తి చెప్పారు. చాలా నవ్వు తెప్పించింది. మీ అందరితో ఆ ఆనందాన్ని పంచుకుందామని ఈ టపా రాస్తున్నాను.
ఒకసారి ఒక అవధానంలో అసందర్భ ప్రసంగంలో ఒక పృచ్ఛకుడు అడిగాడట "ఆ దేవుడు కూడా మోయలేని రాయి ఏది?" అని.
అప్పుడా అవధాని హాస్యంగా ఇలా చెప్పారట.
"ఆ దేవుడు కూడా మోయలేని రాయినే సంసారం అంటారు నాయనా. ఆ దేవుళ్ళు కూడా ఈ సంసార సాగరాన్ని ఈదలేకపోయారు. ఆ విష్ణుమూర్తినే చూడండి. ఆయనకీ ఇద్దరు భార్యలు. ఒకరేమో లక్ష్మీ దేవి. సుచల.ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఇంకొకరు భూదేవి.అచల. స్థిరంగా ఉంటుంది తప్ప ఎక్కడికీ కదలలేదు. ఇక ఆ శివుడి సంసారాన్నే తీసుకుంటే ఆయన వాహనం ఎద్దు, ఆయన బార్య వాహనమేమో సింహం. ఆ సింహం ఈ ఎద్దుని ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆయన పెద్దకొడుకు వినాయకుడి వాహనమేమో ఎలుక. శివుడి మెడలో ఉన్న పాము ఈ ఎలకని తిందామని చూస్తుంటే ఆయన రెండో కొడుకు కుమారస్వామి వాహనమైన నెమలేమో ఆ పాము వంక చూస్తుంటుంది ఎప్పుడు తిందామా అని. ఇలా వాహనాల మధ్య గొడవలతో సతమతమయ్యే ఆయనకి సవతులైన గంగాగౌరిల కయ్యాలు ఉండనే ఉన్నాయి. అందుకే నాయనా ఆ దేవుడు కూడా మోయలేని రాయి సంసారం తప్ప మరొకటి కాదు" అని హాస్యంగా సమాధానం చెప్పారట.