శనివారం, నవంబర్ 29, 2008

అమెరికా జెండా గురించి కొన్ని నిజాలు

ఈ రోజు గూగుల్ వీడియోలో Illuminati గురించి వీడియో చూస్తున్నాను.ఇది Illuminati మీద ఏదో యూనివర్శిటీ లో జరిగిన లెక్చర్ అనుకుంటా.ఇందులో ప్రసంగించిన "Jordan Maxwell" జార్జ్ బుష్ గురించి చాలా ఘాటుగా విమర్శలు చేసాడు. ఆయన చెప్పిన విషయాలలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
"Adolf hitlerr rose to power with arms as george bush does.I am ashamed of the people of this country who call themselves Americans, who drive having a silly US flag on their cars without realizing that its not a US flag. The original United states flag has the stripes going vertical not horizontal. .
ఇది వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. నిజమేనా? జార్జ్ బుష్ తన దేశపు జెండా గురించి అంత అలసత్వంతో ఉంటాడా? ఆయన అంత అలసత్వం చూపించినా ప్రజలూ, మీడియా ఊర్కుంటాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు. గూగుల్ వెతుకులాటలో దొరికిన అన్ని బొమ్మల్లోనూ జెండాలో చారలు అడ్డంగానే ఉన్నాయి. చివరికి లండన్‍లో అమెరికన్ ఎంబసీ వారి అధికారిక వెబ్ సైట్ పేజిలో కూడా తమ జెండాకి చారలు అడ్డంగానే(horizontal) ఉంటాయని స్పష్టంగా చెప్పేసింది. కానీ ఈ విషయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చర్చించారు. దీని నుంచీ నేను గ్రహించిన వివరాలు సంగ్రహంగా ఇవీ
అమెరికా స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత దేశ చిహ్నాలుగా రెండు జెండాలను తయారు చేసారట. సైనిక ఉపయోగాల కోసం అడ్డ చారలుండే జెండాలనీ, సాధారణ అవసరాల కోసం నిలువు చారలుండే జెండానీ తయారు చేసారట. అయితే ప్రభుత్వం ఈ అడ్డ చారల జెండాలే ఎక్కువ తయారు చేయిస్తుండటంతో నిలువు చారల జెండల తయారీ కూడా తగ్గింది. పైగా నిలువు చారల జెండాల ధరలు కూడా ఎక్కువ ఉండటంతో వాటికి ఆదరణ తగ్గింది. అలా అలా 1980 కల్లా అసలు ఈ నిలువు చారల జెండా గురించి అన్ని తరగతి పుస్తకాల నుంచి కూడా తొలగించారట.

నిలువు చారల జెండా

అడ్డ చారల జెండా

గురువారం, సెప్టెంబర్ 25, 2008

నా మొదటి ఛందో పద్యం

మొన్న కొత్తపాళీ గారు ఇచ్చిన ఇతివృత్తం చూసినప్పుడు నాకు సిరికిన్ జెప్పడు లాగా లక్ష్మీ దేవి తన భక్తులను రక్షించటానికి వెళ్ళే సన్నివేశాన్ని అదే ఛందస్సులో రాయాలన్న ఊహ వచ్చింది. చాలా కష్టపడ్డాక చివరికి పద్యం రాయగలిగాను. ప్రాస అయితే కుదిరింది కానీ యతి కుదరలేదు.


|| హరికిన్ జెప్పదు కైటభారి పదముల్ సంప్రీతి సేవింపదే

సురపుష్పమ్ములు బెట్టదన్యములు ఆలోచింపదాందోళనా

భర మంజీరములొగ్గగా గనదు పాలార్ణమ్మునన్ దిన్న వే

లరుచుల్వెన్నలు అంటగా దుడువదా భక్తావనోత్సాహియై


తన భక్తులని రక్షింప ఉద్యుక్తయైన లక్ష్మి, హరికైనా చెప్పక, తాను ఎంతో ప్రేమతో సేవించే విష్ణుమూర్తి పాదాలను సేవించక, తనకి ఇష్టమైన పారిజాతాలైనా పెట్టుకోక,మరే విషయముల గురించీ ఆలోచించకా,ఆందోళన నిండిన ఆమె పాదాల వడిని ఓర్వలేక జారుతున్న మువ్వలనైనా సరిజేయక, ప్రీతితో క్షీరసాగరంపై తేలేటి వెన్నలు తినగా పెదాలపై అంటుకున్న తరకలైనా తుడువక ఉన్నఫళంగా వడివడిగా, హడావిడిగా బయలుదేరింది.

ఈ ఇతివృత్తాన్నికి కథ కూడా మొదలు పెట్టాను. గడువు పొదిగించారు కదా, పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను.

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

దేవుడు కూడా మోయలేని రాయి

మొన్న ఈటీవీ-2 లో తెలుగు-వెలుగు కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు ఈ హాస్యోక్తి చెప్పారు. చాలా నవ్వు తెప్పించింది. మీ అందరితో ఆ ఆనందాన్ని పంచుకుందామని ఈ టపా రాస్తున్నాను.
ఒకసారి ఒక అవధానంలో అసందర్భ ప్రసంగంలో ఒక పృచ్ఛకుడు అడిగాడట "ఆ దేవుడు కూడా మోయలేని రాయి ఏది?" అని.
అప్పుడా అవధాని హాస్యంగా ఇలా చెప్పారట.
"ఆ దేవుడు కూడా మోయలేని రాయినే సంసారం అంటారు నాయనా. ఆ దేవుళ్ళు కూడా ఈ సంసార సాగరాన్ని ఈదలేకపోయారు. ఆ విష్ణుమూర్తినే చూడండి. ఆయనకీ ఇద్దరు భార్యలు. ఒకరేమో లక్ష్మీ దేవి. సుచల.ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఇంకొకరు భూదేవి.అచల. స్థిరంగా ఉంటుంది తప్ప ఎక్కడికీ కదలలేదు. ఇక ఆ శివుడి సంసారాన్నే తీసుకుంటే ఆయన వాహనం ఎద్దు, ఆయన బార్య వాహనమేమో సింహం. ఆ సింహం ఈ ఎద్దుని ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆయన పెద్దకొడుకు వినాయకుడి వాహనమేమో ఎలుక. శివుడి మెడలో ఉన్న పాము ఈ ఎలకని తిందామని చూస్తుంటే ఆయన రెండో కొడుకు కుమారస్వామి వాహనమైన నెమలేమో ఆ పాము వంక చూస్తుంటుంది ఎప్పుడు తిందామా అని. ఇలా వాహనాల మధ్య గొడవలతో సతమతమయ్యే ఆయనకి సవతులైన గంగాగౌరిల కయ్యాలు ఉండనే ఉన్నాయి. అందుకే నాయనా ఆ దేవుడు కూడా మోయలేని రాయి సంసారం తప్ప మరొకటి కాదు" అని హాస్యంగా సమాధానం చెప్పారట.

గురువారం, సెప్టెంబర్ 04, 2008

అన్నమయ్య పై నా బ్లాగు

చివరికి నేను ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్న అన్నమయ్య బ్లాగుని మొదలుపెట్టాను.
అన్నమయ్యకు అక్షర నీరాజనం అనే ఈ బ్లాగులో అన్నమయ్యకీర్తనలూ, ఆయన జీవిత విశేషాలూ, ఆయన రచనా వైభవం, వాటిలోని చమత్కారాలూ వీటి గురించి నాకు తెలిసిన విషయాలు రాస్తూ ఉంటాను.
ఈ బ్లాగుపై మీ అభిప్రాయాలు చెప్పగలరు.

శుక్రవారం, ఆగస్టు 22, 2008

ఫైర్‌ఫాక్స్ కి తెలుగులో ఓ మంచి పేరు పెడదాం

మొన్న వీవెన్ గారి బ్లాగులో ఫైర్‌ఫాక్స్‌ని "మంట నక్క" అని ప్రస్తావించటం చూసాను.

ఆ పదంలో ఏమంత దోషాలు లేకపోయినా నాకెందుకో ఆ పేరు ఫైర్‌ఫాక్స్ కి అంతగా నప్పలేదేమో అనిపించింది.

ఫైర్‌ఫాక్స్‌ని తెలుగులో "జ్వాలా జంబూకం" అని కానీ "జ్వాలా శృగాలం" అని కాని అంటే ఎలా ఉంటుంది?

మీ అభిప్రాయాలు చెప్పండి..

నేనొచ్చేసా - మూడో సారి

ఏంటో ఎప్పుడు బ్లాగుదామనుకున్నా ఏదో ఒక విఘ్నం. అందుకే ఈసారి విఘ్నేశ్వర ప్రార్ధన చేసి మరీ ప్రారంభిస్తున్నాను.ఇప్పుడు కూడా విఘ్నాలు వస్తే దీనికి పూచీ నాది మాత్రం కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
భాను

ఆదివారం, మార్చి 30, 2008

ఏప్రిల్ 11 పెద తిరుమలయ్య జయంతి

అన్నమాచార్యుల వారి సంకీర్తనా వారసుడు పెద తిరుమలయ్య అని అందరికీ తెలిసిన విషయమే.
ఆయన కూడా అన్నమయ్య లా ఎన్నో శ్రుంగార, ఆధ్యాత్మిక సంకీర్తనలను రచించారు.
ఆయన జయంతి ఏప్రిల్ 11 అట. నిన్న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పెద తిరుమలాచార్యుని మీద ఒక చిన్న వ్యాసం వేసారు.
ఆ వ్యాసాన్ని ఇక్కడ చూడండి.
ఈ సందర్భంగా అందరం అన్నమయ్యనూ, వారి వారసుడు పెద తిరుమలయ్యనూ ఒక్కసరి స్మరించుకుందాం.

మంగళవారం, మార్చి 25, 2008

ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాండ

ఎం.ఎస్ రామారావ్ గారు గొప్ప గాయకులు.చాలా మందికి తెలియని విషయం ఆయన చలన చిత్రాలలోనూ చాల పాటలు పాడారని.
ఈనాడులో వ్యాసం చదివేదాక నాకూ తెలియదు.
తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో ఆయన గాన ప్రస్థానం సాగింది.
కానీ ఆయనకి పేరు తెచ్చింది మాత్రం ఆయన రచించి పాడిన సుందరకాండ.ఎంతో శ్రావ్యంగా,మధురంగా సాగిపోతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కూదా ఈయన సుందరకాండ విని ముగ్ధులయ్యారు.
మీరు కూదా ఎం.ఎస్ రామారావ్ గారి సుందరాకాంద వినాలనుకుంటే
ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు
మొదటి భాగం
రెండో భాగం
పుస్తక రూపంలో కావాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

సోమవారం, మార్చి 24, 2008

మరికొన్ని PDF పుస్తకాలు దిగుమతి చేసుకోండి


అందరికీ శుభాకాంక్షలు.
నేను అప్‌లోడ్ చేసిన PDF పుస్తకాలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తాను.
మరికొన్ని PDF పుస్తకాలు ఈ క్రింద ఇస్తున్నాను.
మరికొన్ని PDF పుస్తకాలు

బుధవారం, మార్చి 19, 2008

తెలుగు ఈ-పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొండి

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(dli) వారు మన ప్రాచీన గ్రంధాలను కాపాడాలనే మహోద్దేశంతో వాటిని స్కాన్ చేసి దిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు.
dli సైటుకు వెళ్ళాలంటే ఈ క్రింది లింకు నొక్కండి.
http://www.new.dli.ernet.in/


కాకపోతే ఈ పుస్తకాలన్నీ 'tiff ఫార్మాట్ లో ఉన్నాయి.ఎన్ని పేజీలుంటే అన్ని 'tiff' లన్నమాట.
నేను కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి PDF లోకి మార్చి షేర్ చేసాను.
కావాలంటే మీరు కూదా ఆ PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కొన్ని PDF లు ఈ క్రింద ఇస్తున్నాను.
మీకు నచ్చితే మరిన్ని ఎగుమతి చేస్తాను.

1.కన్యాశుల్కము(గురజాడ వారి రచన)
2. చిల్లర దేవుళ్ళు(తెలంగాణా పోరాటాన్ని చిత్రించిన దాశరధి రంగాచార్య గారి నవల)
3.రెండు మహానగరాల కథ(చార్లెస్ డికెన్స్) తెలుగు అనువాదం

నేను చదివిన పుస్తకాలు

నాకు పుస్తకాలు చదవటం అంటే పిచ్చి, వెర్రి, ఇంక దాన్ని పోల్చటానికి ఎన్ని ఉపమానాలుంటే అన్నీనూ.
నా మిత్రులైతే నన్ను పుస్తకాల పురుగు అని ముద్దుగా పిలిచేవారు.
నేను ఇప్పటివరకూ చాలా పుస్తకాలు చదివాను
అందులో తెలుగు సాహిత్యానికి సంబందించినవి, గ్రీకుపురాణాలకు సంబందించినవీ ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇక నుంచీ నేను చదివిన పుస్తకాలలోని విశేషాలు మీ అందరితో పంచుకుంటాను.


నేను ఈ సారి చెప్పబోతున్న పుస్తకం: హంసగీతం.
ఈ పుస్తకం గురించి చిన్న పరిచయం
ఇది వివిన మూర్తి గారి కలం నుండి జాలువారిన చారిత్రిక నవల. ఇతివౄత్తం శ్రీనాథ కవి సార్వభౌముని జీవిత చరిత్ర.ఇది "రచన" పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది.
ఆ నవల ఆవిష్కరణ సమయంలో "హిందూ" పత్రిక లో వచ్చిన ఈ సమీక్ష చూదండి.
http://www.hindu.com/br/2003/10/28/stories/2003102800030201.htm


దీని గురించి మరింత వివరంగా మరో ప్రచురనలో వివరిస్తాను.
చివరిగా ఒక చిన్న మాట.
ఇది నేనేదో ఆ పుస్తకానికి రాసే సమీక్ష కాదు.నాకు అంతటి పాండిత్యమూ లేదు, ఆ అర్హతా లేదు.
నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్న విషయాలని మీతో పంచుకోవాలని చేసే చిరు ప్రయత్నం మాత్రమే.


ఉంటాను...

తెలుగు బ్లాగర్లలో మరలా చేరిక

అందరికీ శుభాకాంక్షలు.
ఇది నేను చాన్నాళ్ళ తర్వాత బ్లాగుతున్న ప్రచురణ.
ఇక నుంచీ నేను కూడా క్రమం తప్పక బ్లాగటానికి ప్రయత్నిస్తాను.

గురువారం, నవంబర్ 01, 2007

నవకవితా సంకలనం-2008

చైతన్యభారతి వారు పరస్పర సహకార పద్ధతిలో ఒక కవితాసంకలన్నాన్ని ప్రచురించదలిచారు.ఆ కవితాసంకలనం కోస్సం వారు కవితలను ఆహ్వానించుచున్నారు.వారు కవితలను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనని మీరు ఈ క్రింద చూడవచ్చు.ఆసక్తి ఉన్నవారు చైతన్యభారతివారిని సంప్రదించి మీ కవితలను పంపగలరు.

బుధవారం, మార్చి 21, 2007

ఓం అక్షరాయ నమః

ఇది శ్రీ మంజునాధ చిత్రం కోసం భారవి గారు రాసిన పాట. ఈ పాట అంతా శివ స్తోత్రాలతో ఉంటుంది. ఇవన్ని మనకి తెలిసిన స్తోత్రాలే అయినా ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాట లోని స్తోత్రాలన్నీ వర్ణమాలా క్రమంలో ఉంటాయి. అంటే ఓం అక్షరాయ నమః, ఆద్యంతరహితాయనమః, ఇందీవరదళశ్యామాయనమః, ఈశ్వరాయనమః ... ఇలా అ, ఆ, ఇ, ఈ, ... వర్ణమాల లోని అక్షరాలతో సాగిపోతుంది ఈ పాట. ఇలా స్తోత్రాలన్నిటిని కష్టపడి వర్ణమాలా క్రమం లో అమర్చిన భారవి గారిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.


ఇక విషయానికొస్తే ఈ పాట ఓం అక్షరాయ నమః అని మొదలవుతుంది. ఈ స్తోత్రం లోని అంతరార్ధం మొదట నాకు పూర్తిగా అర్ధం కాలేదు. మనకి తెలిసినంతవరకు అక్షరం అనేది విద్యకి సంబంధించిన పదం. సాధారణంగా మనం విద్య కి అధిదేవతలుగా సరస్వతీ దేవిని కాని, గణపతి ని కానీ పూజిస్తాం. మరి అక్షరాయ నమః అనే స్తోత్రం శివుడికి ఎలా వర్తిస్తుంది? మన దేవతా స్తోత్రాలలో కొన్ని అందరు దేవుళ్ళకీ వర్తించేలా ఉంటాయి. అంటే లోకరక్షక, భక్తజనపాలక లాగ. ఇది కూడ అలాగే ఆపాదించిన ఎదో ఒక స్తోత్రం అని సరిపెట్టుకున్నాను.
కానీ కొన్ని రోజుల తర్వాత దాని అంతరార్ధం తెలుసుకున్నాను. నిజానికి అక్షరం ఒక సంస్కృత పదం. న క్షరం అని దానికి విగ్రహం. వ్యతిరేకార్ధాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది నఞ్ తత్పురుష సమాసం. క్షరం అంటే నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. అంటే ఓం అక్షరాయ నమః అనే స్తోత్రం తో శివుణ్ణి నాశనము లేని వాడా అని కీర్తించినట్టు. అది కూడ పాట ప్రారంభం లో ఇలా స్తుతించటం ఎంతైనా సమంజసం.

సోమవారం, నవంబర్ 13, 2006

ఓ చెలీ!

శ్రీవాణీ వీణా సుస్వర గీర్వాణాలో
రాచిలకల ముద్దు ముద్దు పలుకులో
నయాగరా జలపాత ఘోషలో ఓ చెలీ నీ మాటల్!

మత్తకోకిలల ఉషోదయ రాగాలో
ద్విరేఫపు ఝుంకార నాదాలో
కరిగిన నింగి కరతాళధ్వనులో ఓ చెలీ నీ పాటల్!

ఆభోగీ రాగ ఆరోహణలో
ఉత్పలమాలా ఛంధోగమనమో
వృద్ధ గంగా వినిర్మల ప్రవాహములో ఓ చెలీ నీ నడకల్!

సోమవారం, ఏప్రిల్ 24, 2006

మన మహాభారతం తెలుసుకుందాం

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.చిన్నతనం నుంచీ మనకు పరిచయమున్న మహాభారతం లో మనకెంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం.

సోమవారం, ఏప్రిల్ 17, 2006

స్నేహితులారా!
చాలా కాలం నుండి పని ఒత్తిడి వలన నా బ్లాగు లో కొత్తగా ఏ ప్రచురణలూ చేయలేకపోయాను.
ఇక నుంచీ క్రమం తప్పకుండా కొత్త ప్రచురణలు చేస్తాను

గురువారం, అక్టోబర్ 20, 2005

విరివనంలో నా చెలి

ఒకనాడు నా చెలియ విరివనం లో అడుగిడగా

నేలయడిగె ఆమె పదకోమలత్వము
సంపెంగలడిగె ఆమె మేని పరిమళము
గులాబీలడిగె ఆమె అధరాల వర్ణము
సిరిమల్లెలడిగె ఆమె పలువరుస చందము
గండు కోయిలలడిగె ఆమె కంఠ మాధుర్యము
రాచిలకలడిగె ఆమె పలుకు లాలిత్యము
మకరందములడిగె ఆమె అధర సుధారస మాధుర్యము
సుమబాలలడిగె ఆమె సౌకుమార్యము
సుమములన్నియునడిగె ఆమె కురులందు స్థానము

అన్నియూనడిగె ఆమె అంతటి అందము
మరుజన్మలోనైన ఆమె వంటి రూపము



ఈ కవితకు నేను వ్రాసిన చివరి రెండు ముగింపు పాదాలు నాకు సరైనవిగా అనిపించలేదు.అందుకే ఆ రెండు పాదాలనూ కొద్దిగా దూరంగా వ్రాసాను.
ఎవరైనా ఒక మంచి ముగింపును సూచిస్తే తప్పక దానిని ఈ కవితకు జతపరుస్తాను
భాను

బుధవారం, సెప్టెంబర్ 28, 2005

హిందూ మరియూ గ్రీకు పురాణాల మధ్య సారూప్యతలు

నాకు చిన్ననాటి నుండీ కథలంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో "ట్రోజన్ వార్" అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.

గురువారం, సెప్టెంబర్ 22, 2005

తరునమ్ ఖాన్ కి అంకితం

Tarunam khan

రేకులు విచ్చిన లేత సోయగమా
వెన్నెలకే కందిపోవు నవయవ్వనమా
కన్నులలో దాచితివేమది నీలి సంద్రమా
నీ లలాటమే విశాల గగనమా
నా ప్రేమను తెలుపుటకు ఇదే మంచి తరుణమా
ఓ తరునమా!
నా మొరాలించి కాస్త కరుణ చూపుమా