బుధవారం, మార్చి 21, 2007

ఓం అక్షరాయ నమః

ఇది శ్రీ మంజునాధ చిత్రం కోసం భారవి గారు రాసిన పాట. ఈ పాట అంతా శివ స్తోత్రాలతో ఉంటుంది. ఇవన్ని మనకి తెలిసిన స్తోత్రాలే అయినా ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాట లోని స్తోత్రాలన్నీ వర్ణమాలా క్రమంలో ఉంటాయి. అంటే ఓం అక్షరాయ నమః, ఆద్యంతరహితాయనమః, ఇందీవరదళశ్యామాయనమః, ఈశ్వరాయనమః ... ఇలా అ, ఆ, ఇ, ఈ, ... వర్ణమాల లోని అక్షరాలతో సాగిపోతుంది ఈ పాట. ఇలా స్తోత్రాలన్నిటిని కష్టపడి వర్ణమాలా క్రమం లో అమర్చిన భారవి గారిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.


ఇక విషయానికొస్తే ఈ పాట ఓం అక్షరాయ నమః అని మొదలవుతుంది. ఈ స్తోత్రం లోని అంతరార్ధం మొదట నాకు పూర్తిగా అర్ధం కాలేదు. మనకి తెలిసినంతవరకు అక్షరం అనేది విద్యకి సంబంధించిన పదం. సాధారణంగా మనం విద్య కి అధిదేవతలుగా సరస్వతీ దేవిని కాని, గణపతి ని కానీ పూజిస్తాం. మరి అక్షరాయ నమః అనే స్తోత్రం శివుడికి ఎలా వర్తిస్తుంది? మన దేవతా స్తోత్రాలలో కొన్ని అందరు దేవుళ్ళకీ వర్తించేలా ఉంటాయి. అంటే లోకరక్షక, భక్తజనపాలక లాగ. ఇది కూడ అలాగే ఆపాదించిన ఎదో ఒక స్తోత్రం అని సరిపెట్టుకున్నాను.
కానీ కొన్ని రోజుల తర్వాత దాని అంతరార్ధం తెలుసుకున్నాను. నిజానికి అక్షరం ఒక సంస్కృత పదం. న క్షరం అని దానికి విగ్రహం. వ్యతిరేకార్ధాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది నఞ్ తత్పురుష సమాసం. క్షరం అంటే నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. అంటే ఓం అక్షరాయ నమః అనే స్తోత్రం తో శివుణ్ణి నాశనము లేని వాడా అని కీర్తించినట్టు. అది కూడ పాట ప్రారంభం లో ఇలా స్తుతించటం ఎంతైనా సమంజసం.

2 కామెంట్‌లు:

Swati చెప్పారు...

chala bagundi ee artham varnamala kramam lo sage e pata modalu lo ne enta arthavantamaina padam vupayoginchadam rachayita gynaniki nidarsanam.

durgeswara చెప్పారు...

lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi