శుక్రవారం, డిసెంబర్ 18, 2009

కాళిదాసు గురించి - 2: భోజనం దేహి రాజేంద్రా!

కాళిదాసు గురించిన ఈ కథ బాగా ప్రచారం లో ఉంది.
భొజ రాజు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాళిదాసు ఆయన ఆస్థానంలో ఉండేవాడు. ఆ రాజ్యంలోనే ఒక పల్లెలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి రోజు గడవటమే కష్టంగా ఉండేది.
అలా భారంగా రోజులు నెట్టుకొస్తున్న ఆ బ్రాహ్మణుడికి  రాజు గారిని కలిసి చెప్పుకుంటే ఏదో ఒక సహాయం తప్పక చేస్తారు అని ఎవరో చెప్పారు. అంతే కాక రాజు గారు కళా పోషకుడనీ, సామాన్యంగా కన్నా కవులకైతే త్వరగా దర్శనం ఇవ్వవచ్చు అని సలహా కూడా చెప్పారు. ఏం చేస్తాడు ఈ పేద బ్రాహ్మణుడు. తనైతే కవి కాదు కదా. తనకు తెలిసిన విద్య అంతా కూడదీసుకుని శ్లోకంలో ఒక పాదం వరకూ వ్రాయగలిగాడు. ఆయన వ్రాసింది ఏంటంటే
"భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం" అని.
అంటే ఓ రాజా! పప్పూ, నేతితో కూడిన భోజనాన్ని (నేను నిన్ను) అర్ధిస్తున్నాను" అని.
ఎంత ప్రయత్నించినా ఆ  బ్రాహ్మణుడు రెండో పాదాన్ని పూర్తి చెయ్యలేక పోయాడు.
అయినా ఏదో ఒక ఆశతో రాజధాని చేరుకున్నాడు. రాచ వీధిలో తిరుగుతూ తను రాసిన శ్లోక పాదాన్నే తలుచుకుంటూ రెండో పాదం పూరించటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. అలా అతను అటుగా వెళ్తున్న కాళిదాసు కంట పడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి విచారించి విషయం తెలుసుకున్న కాళిదాసు చాలా బాధ పడ్డాడు. వెంటనే అతని చేతిలోని తాళపత్రం తీసుకుని
"మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ" అని ఆ శ్లోకాన్ని పూరించి ఇచ్చి, ఇది చూపించి రాజు గారి దగ్గర సహాయం పొందమని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మొత్తం శ్లోకం
"భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ" అని ఒక రూపానికి వచ్చింది.
అంటే "ఓ రాజా! పప్పూ, నేతితో కూడిన భోజనాన్ని (నేను నిన్ను) అర్ధిస్తున్నాను. వీటితోపాటు శరత్కాల పున్నమి నాటి చంద్రుడేమో అని భ్రమింపజేసే గడ్డకట్టిన తెల్లని గేదె పెరుగు కూడా" (అర్ధిస్తున్నాను).
ఈ శ్లోకాన్ని చూసుకుని బ్రాహ్మణుడు ఎంతో ఆనందంతో రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళి చదివి వినిపించాడు.
రెండో పాదం వినగానే అది కాళిదాసు వ్రాసాడని రాజుకి అర్ధం అయిపోయింది.గట్టిగా గద్దించితే, మొదటి పాదం వరకే తాను రాసాననీ, రెండో పాదం మాత్రం కాళిదాసు రాసాడని సభలో ఉన్న కాళిదాసుని చూపించాడు. రాజు వెంటనే ఆయన రాసిన మొదతిపాదానికి, ఆయన అర్ధించినట్టుగానే భోజనం పెట్టించాడు. రెండో పాదానికి మాత్రం అక్షర లక్షలు ఇచ్చి సత్కరించి పంపాడు.


కొసమెరుపు: పూర్వ కాలంలో ఆవు పాలని ఎక్కువ వాడేవారు. అందునా బ్రాహ్మణులు పూజలూ, పునస్కారాలూ, అభిషేకాలూ అన్నీ ఆవు పాలతోనే చేసేవారు. మరి అలాంటప్పుడు  కాళిదాసు గేదె(మాహిషంచ) పెరుగు ఇమ్మని రాయటంలో ఆంతర్యం ఏంటో నా మట్టి బుర్రకు చానాళ్ళు భోధపడలేదు. చివరికి ఉగ్గబట్టలేక నాకు తెలిసిన ఒక పెద్దాయన దగ్గర నా బాధ అంతా వెళ్ళగక్కేసాను. ఆయన చిన్నగా నవ్వి  "నాయనా! ఆవు పాలు శ్రేష్టమైనవే అయినా గేదె పెరుగు తోడుకున్నంత గట్టిగా తోడుకోదు. అందుకే ఆయన గడ్డలా తోడుకున్న గేదె పెరుగు ఇమ్మని రాసింది" అని చెప్పారు.
ఈ సమాధానంతో అప్పటి దాకా నన్ను పీడిస్తున్న ఈ శంకా భూతం దెబ్బకి వదిలిపోయింది, "దండం దశగుణం భవేత్"  అన్నారు కదా పెద్దలు.


ఈ రోజుకి మరి సెలవు.
ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.

3 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

చాలా చక్కని విషయాలు, కథలు చెప్తున్నారు భాను గారు! మీరు ఇక్కడ దండం దశగుణం భవేత్ అన్నారు కదా దాని గురించి కొంచెం సోదాహరణంగా చెప్పాలనిపించింది. "విశ్వానమిత్రాది పశ్వాదిగాం అప్సు అరు అంధే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్" అని పూర్తి వాక్యం.
భావానికొస్తే - ఈ లోకంలో ఒక కర్ర( సంస్కృతం దండం) అమిత్రులు ( శత్రువుల) నుంచీ ఆత్మరక్షణకీ, పశువులూ మొదలగువాటిని చరచడానికీ , బురదలో, నీటిలో నడిచేటప్పుడు ఊతంగా వాడడానికీ, చీకట్లో ఉన్నవాళ్ళకీ, వయోవృద్ధులకీ ఆధారంగా ఇలా పదివిధాల ఉపయోగపడుతుంది. ప్రాణం లేని కట్టే అంతలా ఉపయోగపడ్డప్పుడు ప్రాణం ఉన్న ఈ కట్టె (మానవ దేహం) ఎంతలా ఉపయోగపడాలి ? ఒక్కమాటలో చెప్పాలంటే పరోపకారార్ధం ఇదం శరీరం అని అర్ధం.

nsmurty చెప్పారు...

భానుగారూ,
మా నాన్నగారు చిన్నప్పుడు ఈ కథ ఎన్ని సార్లు చెప్పేవారో. మళ్ళీ ఈ వేళ చదువుతుంటే ఆయన గుర్తొచ్చారు.

రసజ్ఞా! ఇవాళ నీ దగ్గరనుండి ఇంకో కొత్త విషయం తెలిసింది. అమ్మో, నీ దగ్గర చాలా పెద్ద భోషాణమే ఉంది. మీ కుటుంబ సంస్కారానికి నా నెనర్లు.

ఇద్దరికీ అభినందనలు.

Unknown చెప్పారు...

చాలా మంచి విషయం తెలియపరిచారు.